మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో సహజీవనం చేస్తున్న నర్సును ఒక డాక్టర్ దారుణంగా హత్య చేశాడు. తాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హార్ పురా ప్రాంతానికి చెందిన సంజీవ్ శర్మ వృత్తిరీత్యా వైద్యుడు. మరికొందరు డాక్టర్ లతో కలిసి రుద్రాక్ష హాస్పిటల్ ను నిర్వహిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఇటావా కు చెందిన సోనమ్ యాదవ్ ఆ ఆసుపత్రిలో నర్సుగా శిక్షణ పొందుతోంది.
డాక్టర్ సంజీవ్ శర్మ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కాగా సంజీవ్ శర్మ మొబైల్ ఫోన్ లోని వాట్సాప్ లో ఒక మహిళ తో అసభ్యకర మెసేజ్ పై సోనం డాక్టర్ ని నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవకు ఇది దారితీసింది. ఆగ్రహం చెందిన సంజీవ్ శర్మ సోనమ్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీలింగ్ ఫ్యాన్ కి వేలాడదీసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత ఇంటికి తిరిగి వచ్చి సోనం ఆత్మహత్య చేసుకుందంటూ హంగామా చేశాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాక్టర్ సంజీవ్ శర్మ ను అనుమానించారు. ఆయనను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. దీంతో పోలీసులు సంజీవ్ శర్మ ను అరెస్టు చేశారు. కాగా సంచలనం రేపిన వ్యాపమ్ కుంభకోణంలో డాక్టర్ సంజీవ్ శర్మ నిందితుడని పోలీసులు వెల్లడించారు.