టీమిండియా విదేశీ పిచ్‌లపై ఆడలేదన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. అయినప్పటికీ అటు ధోనీ, ఇటు కోహ్లి సారథ్యంలోని భారత జట్టు అడపా దడపా పలు విదేశీ సిరీస్‌లను గెలుచుకుంది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 కు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే వరల్డ్ కప్ లో పాల్గొంటున్న ఆయా జట్లకు చెందిన ప్లేయర్లు భీభత్సమైన ఫాంలో ఉన్నారు. కానీ మరోవైపు భారత ఆటగాళ్లను చూస్తే మాత్రం.. వీరేనా మనకు కప్పు తెచ్చి పెట్టేది ? అన్న సందేహం కలుగుతోంది. మొన్నటి వరకు ఆహా.. ఓహో.. అని భారత ఆటగాళ్లను పొగుడుకున్నాం. కానీ ఏమైంది..? జట్టులో ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. వరల్డ్ కప్ లో అసలు మనవాళ్లు ఏమైనా ప్రభావం చూపించగలరా..? అనే సందేహం కలుగుతోంది. ఫైనల్ చేరడం అనే మాట పక్కన పెడితే టీమిండియా పేలవ ఆటతీరు ఓ సగటు భారత క్రికెట్ అభిమానిని కలవరానికి గురి చేస్తోంది.
అవును నిజమే.. టీమిండియా ఆడింది వార్మప్ మ్యాచే. అందులో సత్తా చూపకపోతేనేం..? అది అసలు మ్యాచ్ కదు కదా.. అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ.. మ్యాచ్ ఏదైనా సరే.. దానికి ప్రాముఖ్యత లేకపోయినా.. ఆటగాళ్ల ప్రదర్శనకు, జట్టు బలాబలాలను నిర్ణయించుకోవడానికి, ఏ బ్యాట్స్‌మెన్‌ను ఎక్కడ దింపాలో తేల్చుకోవడానికి, జట్టు కూర్పు ఎలా ఉండాలి, ఏయే బౌలర్లను తుది జట్టులోకి తీసుకోవాలి ? అనే వివరాలను తేల్చడానికి అలాంటి ప్రాముఖ్యత లేని మ్యాచ్‌లే ఉపయోగపడతాయి. కనుక అసలు మ్యాచ్ కాదు కదా, వార్మప్ మ్యాచే కదా.. అనే ప్రశ్నలు రాకూడదు.
ఇక కేవలం భారత జట్టు అనే కాదు, ఏ క్రీడలో అయినా.. ఏ జట్టు అయినా సరే.. చివరి వరకు పోరాటం చేయాలి. ఆరంభంలోనే చేతులెత్తేయకూడదు. దురదృష్టవశాత్తూ భారత క్రికెట్ జట్టు.. కొన్ని సార్లు అదే పంథాను కొనసాగిస్తుందని చెప్పవచ్చు. అసలు మ్యాచ్‌లలోనే చాలా సార్లు.. ఆరంభంలో చేతులెత్తేసి చాలా తక్కువ స్కోరుకే ఆలౌటైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక అసలు మ్యాచ్‌ల సంగతి పక్కన పెడితే.. మొన్న జరిగింది కేవలం ప్రాక్టీస్ మ్యాచే కదా.. అన్న నిర్లక్ష్యం చాలా మంది భారత జట్టు ఆటగాళ్లలో మనకు స్పష్టంగా కనిపించింది. వారు ఔటైన తీరు, జట్టు తుది స్కోరును చూస్తేనే మనకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
టీమిండియా విదేశీ పిచ్‌లపై ఆడలేదన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. అయినప్పటికీ అటు ధోనీ, ఇటు కోహ్లి సారథ్యంలోని భారత జట్టు అడపా దడపా పలు విదేశీ సిరీస్‌లను గెలుచుకుంది. అయినా.. ఏదో లోపం.. జట్టులో నిలకడలేని తనం. అదే భారత జట్టును అన్ని సందర్భాల్లోనూ కొంప ముంచుతోంది. అదే మొన్న న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ మనకు స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలోనే ఈ బలహీనత నుంచి టీమిండియా ఇకనైనా బయట పడాల్సిన అవసరం ఉంది. అలా చేయలేకపోతే.. భారత్ కు ఈ సారి కూడా వరల్డ్ కప్ దక్కదు. ఎప్పుడైనా భారత్‌లో వరల్డ్ కప్ టోర్నమెంట్ జరిగితేనే భారత్‌కు ఆ కప్పు గెలిచేందుకు అవకాశం ఉంటుంది.. 2011లో మాదిరిగా.. లేదంటే.. భారత్ ఎప్పటికీ విదేశీ పిచ్‌లపై వరల్డ్ కప్‌లను గెలవలేదు..!