ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే జగన్.. ఎన్డీఏలో ఉండి పోరాటం చేస్తారా..? లేక బయట ఉండే పోరాడుతారా.. ? అని జోరుగా చర్చ నడుస్తోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక.. ఒక్కసారిగా ఆ రాష్ట్రంలోని పరిస్థితులు మారిపోయాయి. జగన్‌ను ఒకప్పుడు తిట్టిన వారు.. మాకెందుకులే అని ఇప్పుడు జగన్ ను పొగుడుతున్నారు. మరోవైపు వైకాపా నేతలు తమ పార్టీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక జగన్ ఇప్పటికే సీఎం కేసీఆర్‌తోపాటు అటు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను కలసి వారికి శుభాకాంక్షలు తెలిపి తన ప్రమాణ స్వీకారానికి రావల్సిందిగా వారిని ఆహ్వానించారు. అయితే కేసీఆర్, మోదీలను జగన్ కలవడం సాధారణమే అయినా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను జగన్ కలవడం అందరినీ ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను జగన్ కలవడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. జగన్ ఎన్‌డీఏలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అమిత్‌షాను జగన్ కలసినప్పుడే ఆయన జగన్‌ను ఎన్‌డీఏలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో జగన్ ప్రత్యేక హోదా ఇస్తే ఎన్‌డీఏలోకి వస్తామని చెప్పగా, అందుకు అమిత్ షా.. చర్చిద్దామని అన్నారు. ఇక జగన్ కూడా తన పార్టీ నేతలతో మాట్లాడి.. ఎన్డీఏలోకి వచ్చే అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే జగన్ అలా అన్నప్పటికీ ఎన్‌డీఏలో వైకాపా చేరే అవకాశాలే పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది.
ఎన్‌డీఏలో చేరడంపై జగన్ ఇప్పటికైతే స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ ఆ కూటమిలో చేరేందుకే జగన్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎవరి మద్దతు అవసరం లేకుండానే ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది కనుక ఇప్పుడేమీ చేయలేమని, సీట్లు తక్కువగా వచ్చి ఉంటే ఎన్డీఏకు మద్దతు పలికి ప్రత్యేక హోదా తెచ్చుకునే వారమని, కానీ అందుకు వ్యతిరేకంగా జరిగందని జగన్ అమిత్‌షాను కలిశాక అన్నారు. అలాగే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవసరం లేదని, అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని జగన్ స్పష్టం చేశారు.
అయితే ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే జగన్.. ఎన్డీఏలో ఉండి పోరాటం చేస్తారా..? లేక బయట ఉండే పోరాడుతారా.. ? అని జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఒక వేళ జగన్ ఎన్డీఏలో చేరి పోరాటం చేస్తే.. ఒకప్పుడు చంద్రబాబు చేసినట్లే అవుతుంది. ఆయన కూడా అప్పట్లో ఎన్డీఏతో కలసి 4 సంవత్సరాల పాటు అంటకాగారు. ఆ తరువాత హోదాపై యూటర్న్ తీసుకున్నారు. దీంతో చంద్రబాబుకు ఈ సారి ఎన్నికల్లో షాక్ తగిలింది. అయితే మరి జగన్ కూడా చంద్రబాబులాగే ఎన్డీఏలో చేరి పోరాటం చేస్తే.. అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. ఇక అలా కాకుండా ఒక వేళ్ల జగన్ ఎన్డీఏలో చేరకుండా బయటి నుంచే పోరాటం చేస్తే.. ఎన్‌డీఏ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా.. అంటే.. అది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. మరి జగన్ ఈ రెండు దారుల్లో దేన్ని ఎంచుకుంటారో, అసలు ప్రత్యేక హోదాను సాధిస్తారో, లేదో.. మరికొంత కాలం ఆగి చూస్తే తెలుస్తుంది..!