పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటివద్ద ఓ ఉగ్రవాది రెక్కీ నిర్వహించిన ఘటన కలకలం రేపింది. కోల్కతా నగరంలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న సీఎం మమతాబెనర్జీ ఇంటి వద్ద ఆ ఉగ్రవాది ఏడు సార్లు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. మమతా బెనర్జీ ఇంటి గురించి సమాచారం తెలుసుకునేందుకు ఉగ్రవాది హఫీజ్ మౌల్లా ఏడు సార్లు రెక్కీ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉగ్రవాది తన సెల్ఫోన్ కెమెరాతో సీఎం నివాసం ఫోటోలు తీశారని వెల్లడైంది.
జూలై 2-3 తేదీల మధ్య రాత్రి హఫీజ్ల్ మోల్లా భద్రతా ఏర్పాట్లను దాటి మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించడాన్ని సెక్యూరిటీ గార్డులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోనులో 11 సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నాడని, బంగ్లాదేశ్ తోపాటు జార్ఖండ్, బీహార్ లోని ఫోన్ నెంబర్లకు కాల్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మొల్లాకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు సూచనలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి చెప్పారు. మరోవైపు మొల్లా పోలీసు కస్టడీని జూలై 18 వరకు పొడగిస్తూ సిటీ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.