బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు MLA, MLC లు కలెక్టర్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి తలసాని. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ప్రభుత్వమని తెలిపారు తలసాని.
3500 కు పైగా ప్రభుత్వ, ప్రయివేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం పంపిణీ చేశామని… ఈ నెల 17 న బోనాల ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు రెండు రోజులలో MLA ల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేస్తామని వెల్లడించారు. 24 వ తేదీన బోనాలు నిర్వహించే హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 18 వ తేదీన చెక్కుల పంపిణీ చేస్తామని.. ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని.
బోనాల ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక శాఖ కళాకారులచే ప్రతి నియోజకవర్గ పరిధిలో 4 ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు చేస్తామని.. పాతబస్తీ లో 25 ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేస్తున్నట్లు వివరించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపధ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు మంత్రి తలసాని.