మోదీని తిడితే…నేషనల్ లీడర్ కాలేవు కేసీఆర్ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పని అయిపోయింది. “కొందరిని ఎల్లకాలం మోసం చేయవచ్చు, అందరినీ కొంత కాలం మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు….” అనే నానుడి తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో నూటికి నూరు శాతం నిజమవుతోందని ఎద్దేవా చేశారు.
ఇక కేసీఆర్ దొర పాలనకు ముగింపు పలకాలని జనం నిర్ణయించుకున్నరు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, మర్యాదగా మెలిగితే పరువు కాస్తయినా మిగులుతుందని… లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని కేసీఆర్‌కు సూచిస్తున్నామని సెటైర్లు వేశారు రాములమ్మ. కొవిడ్ సృష్టించిన సమస్యల వలయం నుంచి ఇంకా బయటపడని ప్రజలను ఆదుకోవలసిందిపోయి…. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకపోవడం, విద్యుత్ చార్జీలు పెంచడం, ఆర్టీసీ చార్జీలు పెంచడంతో…దేశ ప్రధాని హోదాలో వచ్చిన మోదీ గారికి స్వాగతం పలకనప్పుడే కేసీఆర్ కుళ్లు రాజకీయాలు దేశ ప్రజలకు అర్థమయ్యాయన్నారు.
ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా తెలంగాణలో తగ్గించకపోవడంతో ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న కపట ప్రేమ అర్థమైందని పేర్కొన్నారు. కేసీఆర్‌ను దేశవ్యాప్తంగా ఎవరూ పట్టించుకోరన్న విషయం అందరికీ తెలుసు. అందుకే జాతీయ మీడియాను ఆకర్షించడానికి, తనను తాను నేషనల్ లీడర్‌గా పరిచయం చేసుకోవడానికి కేసీఆర్ ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ గారిపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు విజయశాంతి.