తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు వెళ్లారు. అయితే ఢిల్లీ పర్యటనలో ఐదు రోజులపాటు బిజీ బిజీగా గడిపిన సీఎం కేసీఆర్ తన పర్యటనలో యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో శుక్రవారం సమావేశం అయ్యారు. బాబాయ్ శివపాల్ యాదవ్ తో కలిసి అఖిలేష్ ఢిల్లీలోని కెసిఆర్ నివాసానికి వెళ్లారు. అయితే వీరి ఇరువురి మధ్య సమావేశం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది.
ఈ సమావేశంలో ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. బిజెపిని ఎదుర్కొనే వ్యూహంపై అఖిలేష్ యాదవ్ తో చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. అయితే ఐదు రోజులపాటు ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్ పై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కు పెట్టాయి. రాష్ట్రంలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం పత్తా లేకుండా పోయాడని, కేటీఆర్ ఇంటికే పరిమితం అయ్యాడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే వీటిపై ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.