నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీలు, గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలు, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని సీఎం పేర్కొన్నారు. స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మా తండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.
ఈ సందర్భంగా గిరిజనులకు గురుకులాల ద్వారా అత్యున్నతస్థాయి విద్యను, అంబేడ్కర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశీ విద్యను, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడడానికి ఆదివాసీ, గిరిజన యువతకు ఉచిత శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గిరిజన గూడాలకు, తండాలకూ విద్యుత్, రోడ్లు వంటి మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుస్తున్నామన్నారు. కుమురం భీం స్మారక మ్యూజియంతో పాటు పలు మ్యూజియాలు ఇప్పటికే ప్రారంభం కాగా.. రాంజీ గోండు స్మారక మ్యూజియాన్ని త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్లోని విలువైన ప్రాంతంలో ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. ఆదివాసీ సంస్కృతీ, సాంప్రదాయాలు, పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని.. గిరిజన సహకార సంస్థ ద్వారా ఉపాధిని అందిస్తూ, గిరి బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయిస్తూ వారి వ్యాపారాభివృద్ధికీ ప్రభుత్వం దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.