చాలా మందికి ఒకరి కింద పనిచేయాలని ఉండదు. అందుకే సొంతంగా తమ వ్యాపారం నిర్వహించాలనుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితులు వారికి సహకరించవు. అందుకే ఆ ఆలోచన మానుకుంటారు. మరికొందరు కొన్నేళ్లు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వ్యాపారం చేయాలనుకుంటారు. అలా 40 ఏళ్లు పైబడి న వారు వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారికి తోడ్పాటునందించేందుకు ముందుకొచ్చింది ప్రముఖ స్టార్టప్ స్టూడియో జెన్ ఎక్స్ వెంచర్స్. ఈ విషయాన్ని అంకుర సంస్థ సండే టెక్ వెల్లడించింది.
ఈ స్టార్టప్ ను తొలుత 2 మిలియన్ డాలర్ల నిధితో దీన్ని నెలకొల్పినట్లు సంస్థ వ్యవస్థాపకుడు జోసెఫ్ జార్జి తెలిపారు. వచ్చే మూడేళ్లలో 50 స్టార్టప్‌ల వృద్ధిలో పాలుపంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ తదితర నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు.
కెరీర్ మధ్యలో ఉన్న చాలా మంది మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలను వదులుకుని, ఎంట్రప్రెన్యూర్‌షిప్ బాట పడుతున్నారని జార్జి పేర్కొన్నారు. స్టార్టప్ వెంచర్లలో సహ వ్యవస్థాపకులుగా ఉండటంతో పాటు వాటిని ప్రారంభ దశ నుంచి నిర్మించడంలో స్టార్టప్ స్టూడియోల ముఖ్య పాత్ర పోషిస్తాయి.
1965 నుంచి 1980 మధ్య కాలంలో పుట్టిన జనరేషన్ ఎక్స్ (జెన్ ఎక్స్) తరం ప్రస్తుతం 40–50 ఏళ్ల వయస్సులో ఉన్నారని, వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే ఇలాంటి సీనియర్ ప్రొఫెషనల్స్‌కు తోడ్పాటు అందించే సరైన వ్యవస్థ ప్రస్తుతం లేని నేపథ్యంలోనే తాము జెన్‌ఎక్స్ వెంచర్స్‌ను తలపెట్టామని జార్జి పేర్కొన్నారు.