Tourist Places : వైజాగ్ లో బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలు ఇవే..?

-

మీ ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటంటే చాలా మంది ప్యారిస్, బార్సిలోనా, వెనీస్, న్యూయార్క్ అంటూ విదేశాల పేర్లు ఏకరువు పెడుతుంటారు. అవి కాకుండా చెప్పమంటే.. కేరళ బ్యాక్ వాటర్స్, ఉదయ్ పుర్ ప్యాలెస్, డార్జిలింగ్ అంటూ ఉత్తర, దక్షిణ భారత దేశంలోని పర్యాటక ప్రాంతాల గురించి చెబుతుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత అద్భుతమైన హాలిడ్ స్పాట్స్ ఉన్నాయని మీకు తెలుసా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి పలకరించే ఎన్నో టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. అందులోనూ వైజాగ్ గురించి తెలిసిందేగా. అక్కడ ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పెషాలిటీ. మరి మన విశాఖపట్నంలో ఉన్న అందమైన పర్యాటక ప్రాంతాలేంటో ఓసారి చూసొద్దామా..?

ఒకప్పుడు పర్యాటక ప్రాంతాలంటే పట్టణాల్లోని టూరిస్టులను ఆకర్షించే ప్రాంతాలే ఉండేవి. కానీ ఇప్పుడు పర్యాటకం పల్లెకు కూడా వలసొచ్చింది. పల్లెల్లోని అద్భుతమైన, అందమైన ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా మార్చి టూరిస్టులకు అందమైన అనుభూతిని అందిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. అలా విశాఖపట్నంలో ఉన్న పల్లె అందాలు, ప్రకృతి రమణీయత, భూతల స్వర్గాన్ని తలపించే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.

వైజాగ్ అనగానే గుర్తొచ్చేది కైలాసగిరి. ఆర్‌కే బీచ్‌ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి ఉంది. పచ్చని పార్కులు, ఆహ్లాద వాతావరణం, బీచ్‌ వ్యూ ఇక్కడ మంచి అనుభూతినిస్తాయి. కొండ కింద నుంచి రోప్‌ వే, రోడ్డు, మెట్ల మార్గాల ద్వారా పైకి చేరుకోవచ్చు. విశాఖ వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరి వెళ్తుంటారు.

మీరు బీచ్ పర్సనా లేక మౌంటెన్ పర్సనా అని అడిగితే చాలా మంది చెప్పే సమాధానం బీచ్ పర్సన్ అని. తెలుగు ప్రజలు బీచ్ కు వెళ్లాలంటే బెస్ట్ ప్లేస్ భీమిలీ, ఆర్కేబీచ్ లు. ఆర్‌కే బీచ్‌ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భీమిలి ఉంది. తూర్పు తీరంలో పురాతన ఓడ రేవుల్లో ఒకటిగా పిలుస్తారు. గోస్తనీనది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. డచ్‌ పాలకుల సమాధులు, లైట్‌ హౌస్‌లు, బౌద్ధ మత ఆనవాళ్లు ఇక్కడ అనేకం. దీని ముందున్న రుషికొండ బీచ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రావడం విశేషం.వైజాగ్‌ వచ్చే ప్రతి ఒక్కరూ బీచ్‌కు వెళ్లి తీరాల్సిందే. అందుకే వీకెండ్స్‌ అయితే ఇసకేస్తే రాలనంత జనం బీచ్‌లో వాలిపోతారు. షాపింగ్‌ మొదలుకొని స్టే, డిన్నర్‌ వరకూ సకల సౌకర్యాలు పర్యాటకులకు ఇక్కడ లభిస్తాయి.

భూతల స్వర్గం చూడాలనుకుంటే మీరు తప్పకుండా వెళ్లాల్సిన ప్రదేశం విశాఖ మన్యం. మన్యంలోకి వెళ్తే.. అడుగడుగునా జలపాతాలు హొయలుపోతూ కనిపిస్తుంటాయి. కటిక, చాపరాయి, సరయు, డుడుమ, కొత్తపల్లి, సీలేరు ఐసుగెడ్డ, పిట్టలబొర్ర, బొంగుదారి జలపాతాలతో పాటు చిన్న చిన్న జలపాతాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి.

ఊటీ చూడాలనుకుంటే అక్కడికే వెళ్లనక్కర్లేదు. మన ఆంధ్రాలోనూ ఓ ఊటీ ఉంది. అదే అరకు. విశాఖ మన్యం పేరు చెబితే.. పర్యాటకులు పులకరించిపోతారు. సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు వ్యాలీని సందర్శించేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇది జలపాతాలు, క్రిస్టల్‌ క్లియర్‌ స్ట్రీమ్స్‌ , పచ్చని తోటలతో కళకళలాడుతుంటుంది. మంచు మేఘాల వంజంగి మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ టూరిస్టులు ఎంజాయ్‌ చేసే ప్రాంతం వంజంగి. పాడేరు మండలంలో ఉన్న వంజంగి కొండపైకి ఎక్కితే మేఘాలను తాకుతున్నట్లు అనుభూతిని పొందొచ్చు.

మంచు కురిసే వేళలో అని పాట పాడుకోవాలంటే కశ్మీర్ కే వెళ్లనుక్కర్లేదు. డిసెంబర్ లో మన్యంలోని లంబసింగికి వెళ్లండి. అసలైన తెలుగు స్విట్జర్లాండ్ కనిపిస్తుంది. డిసెంబర్‌..జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలకు పడిపోతూ.. ఆంధ్రా కాశ్మీరంగా పేరొందిన లంబసింగికి చలికాలంలో పర్యాటకులు క్యూ కడతారు. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 3600 మీటర్ల ఎత్తులో ఉంది. విశాఖ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు వీడకుండా శీతల గాలులు వీస్తు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.

చాలా మందికి హాలిడే స్పాట్ అంటే ఎంజాయ్ చేసే ప్రాంతాలే అనిపిస్తుంది. కానీ ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే మరోవైపు చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మీకు బొర్రా గుహలు బెస్ట్ ఛాయిస్. అరకులోయలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న ఈ గుహలు వేల సంవత్సరాల పురాతనమైనవే కాదు.. దేశంలో కనిపించే అన్ని గుహలలో అతిపెద్దవి. పూర్తిగా సహజ సున్నపురాయితో తయారైన ఈ గుహలు ప్రకృతిలో కాలిడోస్కోపిక్, జలపాతాలతో పాటు రాళ్లపై పడే కాంతి చాలా రంగురంగులుగా దర్శనమిస్తుంటాయి. ప్రతి ఏడాది సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news