ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన అనేక సత్యాలు చెప్పారు. ఎలా జీవించాలో.. ఎలా జీవించకూడదో.. ఏం చేస్తే మంచిదో.. ఎలా చేస్తే నష్టం కలుగుతుందో అన్నీ వివరించారు. ముఖ్యంగా యువత జీవితానికి సంబంధించి చాణక్యుడు నీతి శాస్త్రంలో అనేక విషయాలు ప్రస్తావించారు. యువత తీసుకునే నిర్ణయాలు.. వారి కొన్ని అలవాట్లు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో వివరించారు. ఆ అలవాట్లకు దూరంగా ఉంటేనే లైఫ్ బాగుంటుందని సూచించారు. మరి ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం.
కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు అన్నారు శ్రీ శ్రీ. అంటే యువత సోమరితనం వాళ్లని వృద్ధులతో సమానం చేస్తుందని చెప్పారు. వృద్ధులు ఎలాగైతే ఆధారపడి జీవిస్తారో.. తమ పని తాము చేసుకోలేకపోతారు కొంతమంది యువతీయువకులు కూడా అలాగే యుక్తవయస్సు వచ్చినా తల్లిదండ్రుల పైనే ఆధారపడి బతుకుతారని అన్నారు. చాణక్యుడు కూడా ఇదే చెప్పాడు. యువత సోమరితనంతో ఉండకూడదని. అది చాలా చెడ్డ అలవాటని. లేజీగా ఉండటం వల్ల ఏ పని చేయాలనిపించదు. ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం అని వాయిదాలు వేస్తూనే పోతారు కానీ పని చేయరు. అందుకే యువత క్రమశిక్షణ కలిగి ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి. సోమరితనాన్ని వీడి లక్ష్యం దిశగా కష్టపడాలని చాణక్యుడు సూచించారు.
కొంతమంది యువత మత్తులోనే తమ జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. మత్తు వల్ల మనిషి విచక్షణ కోల్పోతాడు. శారీరకంగానే కాదు మానసికంగా బలహీనుడవుతాడు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు మానసిక సమస్యలతో అల్లాడిపోతాడు. ఈ వ్యసనాలతో కుటుంబాన్ని దూరం చేసుకుంటారు. అంతా కోల్పోయాక అప్పుడు పశ్చాత్తాప పడుతూ జీవితాన్ని నరకం చేసుకుంటాడు. అందుకే యువకులు మద్యం, మత్తుకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నారు.
చాణక్యుడి ప్రకారం యువత.. యుక్తవయస్సులో ముఖ్యంగా ఫోకస్ పెట్టాల్సిన అంశం ఫ్యూచర్. తాము భవిష్యత్ లో ఏం చేయాలనుకుంటున్నాం.. ఏం కావాలనుకుంటున్నామో ఓ క్లారిటీ ఉండాలని చెప్పారు. సరైన ప్లాన్ తో అనుకున్నది ఈజీగా సాధించొచ్చని సూచించారు. కానీ చెడు అలవాట్లకు బానిస అయితే మాత్రం జీవితాన్ని కోల్పోయినట్టేనని అన్నారు.
యువత చెడు స్నేహానికి దూరంగా ఉండాలి. నీ స్నేహితులెవరో తెలిస్తే నువ్వేంటో చెప్పొచ్చు అంటారు. అంటే మనకున్న స్నేహితులను చూసి మనం ఎలాంటి వాళ్లమనేది చెప్పొచ్చు అని. మంచి మిత్రుడి స్నేహం ఎంత కష్టమైనా పడి సంపాదించాలి. అదే చెడు స్నేహం విడిపించుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి. చెడు సాంగత్యం జీవితాలను నాశనం చేస్తుంది. చెడు సాంగత్యంలో జీవితంలో మీరు ఎదగలేరు. అందుకే అర్థవంతమైన స్నేహితులతోనే సమయం గడపండి. మీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో వారికి చెప్పండి. వారికి చేతనైనంత సాయం చేస్తారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ లైఫ్ లో ఏదైనా సాధించడానికి కలిసి ఎదగండి అని చాణక్యుడు చెప్పారు.