తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి

-

తెలంగాణలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీశారు బిజెపి నేత విజయశాంతి. ప్రత్యామ్న్యాయం పై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. “తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రం అవుతున్నప్పటికీ… ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిపెట్టడం లేదు. నిరుద్యోగ భృతితో పాటు వివిధ కార్పోరేషన్ల కింద లోన్స్ ఇస్తమని చెప్పి ఏళ్ళు గడుస్తున్నా నేతల హామీలు నెరవేరలేదు.

సబ్సిడీ లోన్ల కోసం కార్పోరేషన్లలో అప్లికేషన్స్ పెట్టిన లక్షలాది మంది కాళ్లరిగేలా తిరుగుతున్నరు. దళితబంధు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా… ఎస్సీల్లో ఒక్క శాతం మందికి కూడా ఆ పథకం అమలయ్యే పరిస్థితి లేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగా… ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింద‌నే విమర్శలు వెల్లువెత్తుతున్నయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు అధికారంలోకి వచ్చినా… నిరుద్యోగ సమస్యపై సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదంటున్నరు.

టీఎస్పీఎస్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 20లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నరు. అయితే ఈ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉన్నట్టు దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌కు రోజూ వచ్చేవారిని చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వ కొలువులు ఇవ్వలేకపోయినా… ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్య తీరుస్తమనీ… ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చూస్తమని నేతలు చెప్పే మాటలు నీటి మీద రాతలే అయ్యాయి.

గత ప్రభుత్వాల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువతకు ఆయా కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీతో రుణాలిచ్చేవారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్లయినా ఇంత వరకూ ఎవరికీ రుణాలు రాక పోగా, ఎస్సీలకు 3 ఎకరాల భూమి కూడా అటకెక్కింది. ఈ మధ్య ఆర్భాటంగా ప్రకటించిన దళితులకు 10 లక్షల దళితబంధు కూడా కొంతమందికే ఇవ్వడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నయి. ఒక్కో నియోజకవర్గంలోను 100 మంది ఎస్సీలకే ఇస్తామంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నరు.

లోన్ కోసం తాము అప్లై చేసుకుని చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకూ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. ఇలా హామీల మీద హామీలు గుప్పించి… దళితులతో పాటు అన్ని వర్గాల వారిని మోసగిస్తున్న ఈ సర్కారును గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు.”అంటూ సోషల్ మీడియా ద్వారా మండిపడ్డారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news