పేదలకు చేయూతనందించేందుకు ఆసరా పింఛన్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. 57 ఏళ్లు నిండిన అర్హులైన పేదలందరికీ అందిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా పది లక్షల మందికి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
పేదలకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి పెన్షన్ అందిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లను ఇస్తోంది. సంగారెడ్డిలో పింఛనుదారులకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్మార్ట్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని తెలిపారు. రైతులకు, నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంటే కేంద్రం ఉచితాలు ఇవ్వొద్దని చెబుతుందని విమర్శించారు.
మరోవైపు మేడ్చల్ మండల పరిధిలో 753 మంది లబ్ధిదారులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఫించన్లు అందజేశారు. ఇప్పటికే 36లక్షల మందికి ఫించన్లు అందిస్తుండగా.. అదనంగా మరో పది లక్షల మందికి సర్కార్ ఆసరా సాయం చేస్తోందని వివరించారు. మునుగోడు పోరులోనే కాదు వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ తెరాస గెలిచి తీరుతుందని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.