బిజెపికి భయపడి కెసిఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సిద్ధపడడంతో ఆ క్రెడిట్ బిజెపి ఖాతాలో పడుతుందని భయపడి సెప్టెంబర్ 17న జాతీయ సమగ్రత దినమని.. తెలంగాణ సమగ్రత వజ్రోత్సవాలని కొత్త పేర్లతో కొత్త డ్రామా కి తెరలేపారని మండిపడ్డారు.
“ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం జరగకుండా నాటి పాలకులు అడ్డుకున్నరని… తెలంగాణ ఉద్యమ సమయంలో నానా గాయిగత్తర చేసిన నేటి సీఎం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ల పాటు నిద్రపోయి… ఇప్పుడు ఉన్నట్టుండి మేలుకున్నరు. తమ సయామీ కవల పార్టీ ఎంఐఎం కనుసన్నల్లో కారు నడిపిస్తూ విమోచన దినోత్సవం పేరెత్తే ధైర్యం చెయ్యలేకపోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ముందడుగువేసి విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సిద్ధపడటంతో ఆ క్రెడిట్ బీజేపీ ఖాతాలో పడుతుందని భయపడి సెప్టెంబర్ 17ను జాతీయ సమగ్రతా దినమని… తెలంగాణ సమగ్రతా వజ్రోత్సవాలని కొత్త పేర్లతో కొత్త డ్రామాకి తెరలేపారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అనుమతి వచ్చాకే కేసీఆర్ సమగ్రతా రాగం అందుకున్నరన్నది తిరుగులేని సత్యం. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆదేశాలతో జరిగిన ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానానికి నిజాం నిరంకుశ పాలన నుంచి విమోచన లభించింది. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలిపిన సెప్టెంబర్ 17ని పక్కనున్న మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విమోచన దినోత్సవంగా జరుపుతుంటే కేసీఆర్ మాత్రం ఆ పేరెత్తడానికే వణికిపోతున్నరు. అసదుద్దీన్, కేసీఆర్లు దీన్ని జాతీయ సమగ్రత…. అంటున్నరు. జాతీయ స్థాయిలో పెద్ద సంఖ్యలో ఎన్నో రాష్ట్రాలు సెప్టెంబర్ 17 కంటే ఏడాది ముందే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది ఇండియన్ యూనియన్లో కలిసిపోయాయి.
అందుకు భిన్నంగా హైదరాబాద్ సంస్థానం మాత్రమే సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి పొందింది. ఇది దేశవ్యాప్తంగా జరిగిన జాతీయ స్థాయి పరిణామం కాదు… జాతీయ సమగ్రతకు దీనికి సంబంధం లేదు. కోఠీలోని నిజాం సమాధి వద్దకు కేసీఆర్ వెళ్లి సలాం చేసిన ఘటనను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఇది కేసీఆర్-అసదుద్దీన్ల కొత్త డ్రామా తప్ప మరొకటి కానేకాదని ప్రజలకి తెలుసు.ఏది ఏమైనా మెజారిటీ ప్రజల మనోభావాలు గౌరవించబడాల్సిన ఆవశ్యకతని దారుస్సలాం, టీఆరెస్ సయామీలు అనివార్యంగా గుర్తించి, తమ అంతర్గత మనోసమ్మతి ఎలా ఉన్నప్పటికీ అసంబద్ధమైన సమగ్రతా దివస్ను జనుల ముందుకు తెచ్చి చెయ్యబోతున్న విన్యాసాలు, ప్రకటనలు అన్నీ సంపూర్ణంగా తెలిసిన ప్రజలకు….. ఇదంతా హాస్యాస్పదం. ఇంతదాంకా ఆ రెండు కవల పార్టీలను తెచ్చిన కమల కార్యకర్తల బీజేపీ విజయం ఇది అని తెలంగాణ సమాజం అనుకోవడం ప్రస్తుత పరిణామం.”అన్నారు విజయశాంతి.