భూ రికార్డుల ప్రక్షాళన కోసం తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ సమస్యలతో సతమతమవుతూ ఉంది. ధరణిలో ఉత్పన్నమైన సమస్యలు యజమానులకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. తప్పిదాలు, పొరపాట్లు, బదలాయింపు ప్రక్రియ సందర్భంగా ఏర్పడిన సమస్యలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నీ సవ్యంగా ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు సాఫీగా సాగిపోతుండగా సమస్యల్లో పడిన వారి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది.
ధరణి సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. టీఎం 33 మాడ్యూల్ కింద వచ్చిన దరఖాస్తులతో పాటు పొరపాటుగా నిషేధిత జాబితాలో చేరిన భూముల సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఆయా జిల్లాల్లో ఎక్కువగా ఉన్న ఒకే రకమైన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. తద్వారా ఎక్కువ మంది సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొంది. వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కార స్థితి, సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని కలెక్టర్లను సర్కార్ ఆదేశించింది.