అధికారపార్టీ నేతలు చేస్తున్న కార్యక్రమాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు టిడిపి విజయనగరం పార్లమెంటు అధ్యక్షుడు కిమిడి నాగార్జున. ప్రభుత్వ సంస్థలకి ఆ ప్రాంతంలో గొప్పవారి పేర్లు పెట్టడం ఆనవాయితీ.. అయితే విజయనగరం మహారాజా ఆసుపత్రి పేరు మార్చింది కాక డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయనగరం లో మహారాజుల పేరు, కీర్తి ప్రతిష్టలు ఎవరు కాదనలేనివని అన్నారు నాగార్జున.
విజయనగరంలో రాజీవ్ స్టేడియం ఉంది.. అయితే అది రాజీవ్ గాంధీ ఇచ్చిన స్తలమా? అని ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మరో వైపు రాజధాని గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని.. బొత్స మాటలు నమ్మే పరిస్తితి లేదన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తిరిగి రాజధాని వారి ప్రాంతంలో కావాలో వద్దో అడగండని అన్నారు. ఈ జిల్లా అభివృద్ధి జరిగిందంటే అవినీతి రహితుడు అశోక్ గజపతిరాజు వల్ల మాత్రమే జరిగిందన్నారు. అశోక్ గజపతిరాజు లేకుంటే ఈ అభివృద్ధి కూడా జరిగేది కాదన్నారు. విజయనగరం దోపిడీలు, అక్రమాలకు అడ్డాగా ఉండేదన్నారు.