గత కొంత సేపటి క్రితమే కర్ణాటక అసెంబ్లీలో ఎట్టకేలకు విశ్వాస పరీక్ష నిర్వహించారు. అందులో తగినంత బలం లేనందున కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. సీఎం కుమారస్వామి విశ్వాస పరీక్షలో ఓడిపోయారు.
గత వారం రోజులుగా కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలకు నేటితో తెరపడింది. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో మైనార్టీలో పడిపోయిన సీఎం కుమారస్వామి సర్కారుకు ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా బలం నిరూపించుకోవాలని పలుమార్లు డెడ్లైన్లు విధించినా.. సీఎం పట్టించుకోలేదు. ఈ క్రమంలో తమ రెబెల్ ఎమ్మెల్యేలను ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవాలని యత్నించిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల యత్నాలు ఫలించలేదు. దీంతో తమ ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా సరే… చివరకు ఎట్టకేలకు సీఎం కుమారస్వామి బలపరీక్షకు తలొగ్గక తప్పలేదు. ఈ క్రమంలోనే గత కొంత సేపటి క్రితమే కర్ణాటక అసెంబ్లీలో ఎట్టకేలకు విశ్వాస పరీక్ష నిర్వహించారు. అందులో తగినంత బలం లేనందున కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. సీఎం కుమారస్వామి విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. సభలో బీజేపీ మెజార్టీ సాధించడంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో యడ్యూరప్ప సీఎంగా త్వరలో ప్రమాణం చేయనున్నారు.
బలపరీక్ష నేపథ్యంలో స్పీకర్ మొదటగా సభకు హాజరైన ఆయా పార్టీలకు చెందిన మొత్తం సభ్యుల సంఖ్యను విడి విడిగా లెక్కించారు. మార్షల్స్ సహాయంతో ఒక్కో వరుసలో ఉన్న సభ్యులను లెక్కిస్తూ చివరకు సభలో ఆయా పార్టీలకు చెందిన మొత్తం సభ్యులను వేర్వేరుగా లెక్కబెట్టారు. ఈ క్రమంలో సభలో బీజేపీకి అనుకూలంగా 105 ఓట్లు రాగా, కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ కూటమికి 99 ఓట్లు వచ్చాయి. దీంతో సీఎం కుమార స్వామి ప్రభుత్వం పడిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. విశ్వాస పరీక్షలో బీజేపీ నెగ్గడంతో ఇక యడ్యూరప్ప సీఎం అవనున్నారు..!