మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్‌లోని రీవా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గమనించిన స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
సుమారు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది కూలీలు మరణించారు. మరో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రయాణికులంతా యూపీ, బిహార్‌కు చెందినవారని వెల్లడించారు. దీపావళి పండుగ కోసం తమ స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బస్సు ముందు వెళ్తున్న ట్రక్కు మొదట ఓ గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి ట్రక్కును వెనకనుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు ముందు భాగంలో కూర్చున్నవారు మృత్యువాత పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.. మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.