కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చేనేత ఉత్పత్తులపై విధించిన 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ పెను ఉద్యమమే షురూ చేశారు. తాజాగా ప్రధాని మోదీపై మరో యుద్ధానికి శ్రీకారం చుట్టారు కేటీఆర్. ప్రధాని మోదీ తీసుకొచ్చిన పీఎం రోజ్‌గార్ మేళా-2022పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కేటీఆర్ లేఖ రాశారు.
‘‘రోజ్‌గార్ మేళా పచ్చి దగా, ఇది యువతను మోసం చేయడమే అవుతుంది. నమో అంటే.. నమ్మించి మోసం చేసేవాడని రుజువైంది. ఎన్నికల ముందు యువతను మోసం చేసే ప్రచారాలు మానుకోవాలి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ముందు మోదీ మరో కొత్త డ్రామా.75వేల ఉద్యోగాల పేరుతో చేస్తున్న రోజ్‌గార్ ప్రచారం.. నిరుద్యోగ యువతపై చేస్తున్న క్రూరపరిహాసం. దేశంలో నిరుద్యోగ సమస్యపై నిబద్ధతతో వ్యవహరించాలి. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు అన్నారు.. మరి 8ఏళ్లలో 16కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? భాజపా హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలెన్నో శ్వేతపత్రం విడుదల చేయగలరా? యువత కేంద్రంపై తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది’’ అని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.