అనంతపురం జిల్లా దుర్గా హోన్నూరులో విద్యుత్ మెయిన్ లైన్లు తెగిపడిన ఘనట పై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ సందర్భంగా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన వెల్లడించారు. విద్యుత్ శాఖ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, సిఎంఆర్‌ఎఫ్ ద్వారా మరో రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశించామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.
అంతేకాకుండా.. సంఘటన జరిగిన పరిధిలోని సబ్ డివిజన్ ఎడిఇ, ఎఇఇ, లైన్ ఇన్స్ పెక్టర్, లైన్ మెన్ లను సస్సెండ్ చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై అనంతపురం ఎస్ ఇ, ఇఇ ల వివరణ కోరామని, సంఘటనా స్థలంను సందర్శించి సమగ్ర నివేదిక సమర్పించాలని డైరెక్టర్ ఫర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ కి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.