బీజేపీయేతర రాష్ట్రాల్లో చాలావరకు గవర్నర్ వర్సెస్ సీఎం వైఖరి నడుస్తోంది. మొన్నటిదాక దిల్లీ, తెలంగాణ.. ఇప్పుడు కేరళ. కేరళలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ విశ్వవిద్యాలయాల వీసీ నియామకాల్లో గవర్నర్ రాజకీయంగా జోక్యం చేసుకుంటున్నారన్న సీఎం పినరయి విజయన్ చేసిన ఆరోపణలను గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. అందుకు ఒక్క ఉదాహరణ చూపించిన తాను రాజీనామా చేస్తానన్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయగలరా అని బహిరంగంగా ఛాలెంజ్ చేశారు.
“ముఖ్యమంత్రి కార్యాలయమే రాష్ట్రంలో స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోంది. దీంట్లో సీఎం జోక్యం ఉందనడానికి రుజువులు ఉన్నాయి. ఇదంతా నేను చూస్తునే ఉన్నాను. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న వ్యక్తులు కన్నూర్ విశ్వవిద్యాలయంలో తమ బంధువులను ఎటువంటి అర్హత లేకున్నా నియమించుకోవాలని వీసీని ఆదేశించారు.” అని గవర్నర్ అన్నారు.
తాను ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులను తీసుకురావడానికే వీసీలపై చర్యలకు పాల్పడుతున్నట్లు వామపక్ష ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. “నా అధికారాన్ని ఉపయోగించి ఆర్‌ఎస్‌ఎస్‌కే కాదు, ఏ వ్యక్తినైనా, నామినేట్ చేసి ఉంటే దాన్ని నిరూపించండి రాజీనామా చేస్తాను. లేదంటే మీరైనా రాజీనామా చేయండి” అంటూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.