నందిగామలో చంద్రబాబు రోడ్‌షోలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ర్యాలీపై దాడి జరిగింది. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారికి గాయాలయ్యాయి. చంద్రబాబు వాహనంపైకి రాయి విసిరారు దుండగులు. అయితే.. తాగాజా ఈ ఘటనపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు కాన్వాయిపై రాళ్ల దాడి.. వైసీపీ రౌడీ రాజకీయానికి పరాకాష్ట అని అభివర్ణించారు. అంతేకాకుండా.. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఏసీలో ఉండి కూడా జగన్ రెడ్డికి చెమటలు పడుతున్నాయని ఆయన విమర్శించారు. ఒక పార్టీ జాతీయ అధ్యక్షునిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..? అని ఆయన ప్రశ్నించారు. జగన్ రెడ్డి నీ రౌడీ రాజకీయాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం పగటి కల అని, చంద్రబాబు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గుండాల పరిస్థితి ఏంటి? అని ఆయన మండిపడ్డారు.
అధికారం ఉంది కదా అని బరి తెగిస్తే బడితే పూజ తప్పదని, దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడి పిరికిపంద చర్య అని యనమల రామకృష్ణుడు అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. జగన్ పట్టపగలే ప్రజాస్వామ్యన్ని హత్య చేస్తున్నారన్నారు యనమల రామకృష్ణుడు. జగన్ తమ కార్యకర్తలకి ఎదుటివారిపై దాడులు చేయమని లైసెన్సులు ఇచ్చి రోడ్ల మీదకి వదిలినట్టున్నారన్నారు యనమల రామకృష్ణుడు. పార్టీ జాతీయ అధ్యక్షునిపై దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా..? ఈ ఘటనకు సీఎం, డీజీపీ బాధ్యత వహించాలన్నారు యనమల రామకృష్ణుడు.