హైబీపీ అదుపులో ఉండాలంటే ఈ సూచనలను కచ్చితంగా పాటించాలి..!

-

గుండెకు రక్తం సరఫరా అయ్యే రక్తనాళాల్లో ఎల్లప్పుడూ పీడనం ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ అంటారు. రక్తనాళాల్లో రక్తం సరఫరా అయ్యేటప్పుడు అధిక మొత్తంలో ప్రెషర్‌తో రక్తం పంప్ అవుతుంది. ఇలాంటి స్థితిని హైబ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటు అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 1.13 బిలియన్ల మంది హైబీపీతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. హైబీపీకి కచ్చితంగా సరైన సమయంలో చికిత్స తీసుకోవాల్సిందే. లేదంటే హార్ట్ ఎటాక్‌లు, ఇతర గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రక్తపోటు 130/80 కన్నా ఎక్కువ ఉంటూ, అది అలాగే కంటిన్యూ అవుతుంటే దాన్ని రక్తపోటుగా పరిగణించాలి. ఈ క్రమంలో వైద్యున్ని కలసి చికిత్స తీసుకోవాలి. దీంతోపాటు అధిక రక్తపోటును తగ్గించుకునేందుకు ఆహారం, జీవనశైలి తదితర విషయాల్లోనూ పలు మార్పులను పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

హైబీపీని అదుపు చేసేందుకు డైట్ టిప్స్:

1. నిత్యం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండాలి. లేదంటే శరీరంలో సోడియం నిల్వలు పెరిగిపోయి నీరు ఎక్కువగా చేరుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. కనుక ఉప్పు తగ్గించాలి.

2. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. పొటాషియం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది.

3. నిత్యం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుపచ్చని కూరగాయలు, నట్స్ తదితర పదార్థాలను నిత్యం తీసుకోవాలి.

4. ఆయిల్, ఉప్పు తక్కువగా ఉండేలా ఆహారాలను తీసుకోవాలి.

5. చిరుతిండిని పూర్తిగా మానేయాలి. అధిక శాతం చిరుతిళ్లలో నూనె ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని మానేయాలి.

హైబీపీని అదుపు చేసేందుకు పాటించాల్సిన పలు ఇతర సూచనలు:

1. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా బీపీ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

2. మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. అవి బీపీని పెంచుతాయి.

3. నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. నిద్ర తక్కువైనా ఆ ప్రభావం బీపీపై పడుతుంది.

హైబీపీని అదుపు చేసే ఆహారాలు:

అరటిపండ్లు, అవకాడోలు, పుచ్చకాయలు, చిలగడదుంపలు, పాలకూర తదితర ఆహార పదార్థాల్లో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ మనకు లభిస్తాయి. కనుక వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా హైబీపీని అదుపు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news