2020 దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగిపోయిన సంవత్సరం. దేశ చరిత్రలోనే అత్యధికంగా 2020లో 81.15 లక్షల మరణాలు నమోదైనట్లు కేంద్ర జనగణన శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. అంతకుముందు ఏడాది (2019)తో పోలిస్తే ఏకంగా 4.74 లక్షల మరణాలు అధికంగా 2020లో నమోదైనట్లు తెలిపింది. ఇతరత్రా కారణాలూ ఉన్నా ప్రధానంగా కరోనా వల్ల అధిక మరణాలు సంభవించాయని అంచనా.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ ఏడాది 45 ఏళ్లు పైబడిన వారు కూడా చనిపోవడం విషాదం. ఇదే ఏడాది తెలుగు రాష్ట్రాలు సహా.. దేశవ్యాప్తంగా జననాలు తగ్గడం గమనార్హం. దేశంలో 2019లో నమోదైన జననాలు 2,48,20,886. 2020లో అంతకంటే 5,98,442 తగ్గి 2,42,22,444 మంది శిశువులు పుట్టారు. ఈ లెక్కలన్నీ పక్కాగా జననం లేదా మరణం సంభవించిన 21 రోజుల్లోగా గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేయించినవే. తెలంగాణ, ఏపీల్లో ఈ నమోదు కార్యక్రమం సరిగా జరగడం లేదని కేంద్రం తాజాగా వెల్లడించింది.