వైసీపీ పార్టీపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో అభ్యర్థిని మార్చాలనుకుంటే నియోజకవర్గానికి వేరే ఇన్ చార్జీని నియమించుకోవచ్చని, ఎన్నికల వరకు ఆయనతో కలిసి తిరుగుతానని, పార్టీ అధిష్టానాన్ని త్వరలోనే కలిసి ఇదే చెబుతానని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైకాపా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తనను కోరితే, చేస్తానని, లేదంటే పార్టీ కోసం పాటుపడతానని, ఎలాంటి అసంతృప్తి లేదని, సీఎం జగన్ నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. నియోజకవర్గంలోని ఇంటి పోరు సర్దుకుంటుందని భావించి, తాను మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పు, కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి పై తన తండ్రి వసంత నాగేశ్వర రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.