ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాల్సిన ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ కలెక్టర్ చేసి చూపించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోవడంతో 88మంది ఉద్యోగాలు పీకేశారు. వివరాల్లోకి వెళితే మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్ అధ్యక్షతన గురువారం సాయంత్రం హరితహారంపై ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే సమావేశం సాయంత్రం 7 గంటలకు మొదలు కాగా, కలెక్టర్ 8:30 గంటలకు సమావేశానికి వచ్చారు. ఈయన వచ్చేసరికి సమావేశంలో పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు. ఈ విషయం గురించి కలెక్టర్ ఆరా తీయగా…అప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయితీ కార్యదర్శులు సమావేశం నుంచి వెళ్ళిపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో కలెక్టరుకు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న హరితహారం, జలశక్తి అభియాన్ పథకాలకి సంబంధించి సమావేశం జరుగుతుంటే అలా ఎలా వెళ్లిపోతారని అక్కడున్న అధికారులని ప్రశ్నించారు.
కలెక్టర్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశ మందిరంలో నిశబ్ద వాతావరణం నెలకొన్నది. మిగతా అధికారులు సైలెంట్ గా చూస్తుండిపోయారు. ఇక ఈ విషయంలో ఇంత నిర్లక్ష్యం ఉన్నవారిని కఠినంగా శిక్షించాల్సిందే అని భావించిన ఆయన సమావేశం నుంచి వెళ్ళిపోయిన వారి వివరాలు తీసుకొని వారందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలు జారీచేయడం ఆలస్యం..క్షణాల్లో సంబంధిత శాఖ నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా వచ్చేశాయి. మొత్తం 88 మంది ఉద్యోగులని సస్పెండ్ చేశారు. వీరిలో 64 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 24 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.