టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిజెపి నేత బిఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట లభించింది. సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈనెల 28న విచారణకు రావాలని సిట్ పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. దీంతోపాటు ఈ కేసు విచారణ డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. సంతోష్ విచారణకు హాజరు కావాలని కోరుతూ సిట్ రెండుసార్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై సంతోష్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో నేడు విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్ లో సీట్ నోటీసులను రద్దు చేయాలని ఆయన కోరారు. రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదులో బిఎల్ సంతోష్ పేరు లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఆయన తరపు న్యాయవాది. అంతేకాక ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు ఆయనని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని సంతోష్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న కోర్ట్ సిట్ విచారణ పై స్టే విధించింది.