గోవుల మృత్యువాత వెనున దాగివున్న మర్మం ఏమిటి..? కావాలనే వాటిని చంపారా..? ఆ షెడ్లు ఉన్నభూమికి ఎవరైనా ఎసరు పెడుతున్నారా..? అందులో భాగంగానే.. ఇలా భారీ స్కెచ్ వేశారా..? లేక అనుకోని ప్రమాదకర పరిస్థితుల్లో అవి చనిపోయాయా..? అనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. ఎందుకంటే.. ఒకటికాదు.. రెండుకాదు..ఏకంగా వంద గోవులు విజయవాడ శివారు కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో ఒక్కసారిగా మృత్యువాతపడడం సంచలనంగా మారింది. ఏం జరిగింది..? ఎందుకు జరిగింది..? అన్న ప్రశ్నలు అటు ప్రభుత్వాన్ని ఇటు సామాన్యులను వెంటాడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
గోవుల మృత్యువాతపై మొదట పోలీసులు ఎలాంటి అనుమానాలు లేవంటూ చెప్పారు. కానీ.. ఆ తర్వాత డీజీపీ గౌతం సవాంగ్ స్పందించి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పశుసంవర్థకశాఖ, ఫోరెన్సిక్ సైన్స్, ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి ఆవులకు గడ్డి తరలించేవారని.. ఇలా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి సమీపంలో కొందరు మార్వాడీలు గోసంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆవులను సంరక్షిస్తున్నారు.
అయితే.. ఈ స్థలం సరిపోకపోవడంతో తాడేపల్లిలో మరో గోశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు పది షెడ్లు, మూడు బ్యారక్ల్లో సుమారు 1500 ఆవులు ఉన్నాయి. కొన్నాళ్ల కిందటి వరకు విజయవాడలో దాణాను కొనుగోలు చేసేవారు. అయితే.. ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి పశువులకు పచ్చగడ్డి తెప్పించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ఎప్పటిమాదిరిగానే గోవులకు పచ్చగడ్డి వేశారు. అవి తిన్న ఆవులు తిని ఒక్కసారిగా కుప్పకూలాయి…నోరు, ముక్కు నుంచి నురగలు వచ్చి మృత్యువాత పడ్డాయి. గడ్డిలో పాయిజన్ కలిసి ఉంటుందా.. ? లేక మరేదైనా కారణం గానీ ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక తెలంగాణ, ఏపీ బీజేపీ నేతలు గోశాలను సందర్శించి అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడ మరో బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ గోశాల ఉన్న ఏడెకరాల భూమిపై ఓ రాజకీయ నేత కన్నేశారని, ఆ క్రమంలోనే ఇది జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇందులో నిజానిజాలు ఇక ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చాల్సిందే మరి.