తెలంగాణ రాష్ట్ర పౌరసరాఫరాల సంస్థ చైర్మన్ గా కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారని పేర్కొంది. న్యాయవాది అయినా రవీందర్ సింగ్ 2006లో తెరాసలో చేరారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారు.
2014లో కరీంనగర్ నగర పాలక చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2021లో ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్లీ తెరాసలో చేరారు. ఈ క్రమంలో రవీందర్ ను పౌరసరాఫరాల సంస్థ చైర్మన్ గా నియమించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. మంత్రి గంగుల, రవీందర్ లు విభేదాలు మరిచి కలిసి పనిచేసేందుకు వీలుగా రవీందర్ సింగ్ ను పౌరసరాఫరాల సంస్థకు చైర్మన్ గా నియమించినట్లు తెలుస్తోంది. తన నియామకం పై రవీందర్ సింగ్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.