వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా సిద్ధం అవుతోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో మొట్టికాయలు తిన్న వారు కూడా జనసేన పార్టీ వారాహి వాహనం రంగు గురించి మాట్లాడటం, నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నిబంధనలు పరిశీలించకుండా, ఏ రంగు వేశారో చూడకుండా రవాణా శాఖ వారు అనుమతి ఎలా ఇస్తారు? అని ఆయన అన్నారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా విమర్శలు చేయడం వైసీపీ నాయకుల బుద్ధిరాహిత్యాన్ని, మూర్ఖత్వాన్ని తెలుపుతోందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం పార్టీ రంగులు వేసుకునే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
జనసేన పార్టీ ఎల్లప్పుడు నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకుంటుందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజాహితంగా, చట్టానికి లోబడి ఉంటుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు వ్యక్తిగత విమర్శలు చేయటం అలవాటుగా మారిపోయిందని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. వాళ్లకు పవన్ కళ్యాణ్ ఒక్కసారి చెప్పు చూపిస్తే భయపడ్డారని, అది నిజాయితీకి ఉన్న దమ్ము అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.