బ్యాంకుల బకాయిల్ని మొత్తం చెల్లించేస్తానని విజయ్ మాల్యా పునరుద్ఘాటించారు. రుణాల్ని చెల్లించడానికి కర్నాటక హైకోర్టుకు తానో సమగ్రమైన ఆఫర్‌ను అందించిన విషయాన్ని గుర్తుచేసిన మాల్యా.. ఆస్తులను అమ్మి అప్పు తీర్చడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐలు అడ్డుపడితే బకాయిల వసూలుకు మించి తనకు వ్యతిరేకంగా ఎజెండా ఉందని భావించాల్సి వస్తుందని విజయ్ మాల్యా అన్నారు. తన ఆస్తులు, తాను కోర్టు పరిధిలోనే ఉన్నామన్నారు. తనకు ఉన్న రూ. 13,900 కోట్ల ఆస్తులను రుణాలను తీర్చేందుకు అమ్మడానికి అనుమతి ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టు అనుమతిని కోరిన విషయం తెలిసిందే.
విచారణ సందర్భంగా మంగళవారం ఉదయం కోర్టుకు హాజరైన ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన డబ్బు దొంగతనం, మనీ లాండరింగ్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని చెప్పారు. త్వరలోనే ఈ వివాదం అంతా కూడా ముగిసిపోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై మోపిన నేరాభియోగాలు అసత్యాలని గత నెలలోనూ మాల్యా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా బకాయిపడగా, ఈ కేసులో విచారణను తప్పించుకోవడానికి 2016 మార్చిలో 62 ఏండ్ల మాల్యా లండన్‌కు పారిపోయారు.