బీజేపీ అధ్యక్ష పదవిపై ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను మరికొద్ది కాలంపాటు కొనసాగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జనవరిలో దిల్లీ వేదికగా జరిగే బీజేపీ జాతీయ సంస్థాగత సమావేశంలో ఈ దిశగా అడుగులు పడనుందని సమాచారం. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ భావిస్తోంది. అదే జరిగితే.. జేపీ నడ్డానే జాతీయ అధ్యక్షుడిగా మరికొంత కాలం కొనసాగనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
బీజేపీ జాతీయ సంస్థాగత సమావేశంలో.. 2023లో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరగనుంది పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా బీజేపీ జాతీయ కార్యవర్గం సమాలోచలను జరపనుందని వెల్లడించాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న సన్నద్ధతను సైతం సమీక్షించనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
వచ్చే నెలలో జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవి కాలం పూర్తవుతుంది. పార్టీ విధానాల ప్రకారం జాతీయ స్థాయిలో సంస్థాగత ఎన్నికలు జరగాలంటే కనీసం సగం రాష్ట్రాలలో అంతర్గత ఎన్నికలు పూర్తి కావాలి. వరుసగా ఎన్నికలు ఉన్నా దృష్ట్యా ఇది సాధ్యపడదు. 2024 ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ పక్రియ మొదలు కానుంది. అప్పటివరకు నడ్డానే అధ్యక్షునిగా కొనసాగే అవకాశం ఉంది.