ఏపీలో టీటీడీ ఛైర్మన్ మార్పుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి పదవి నుంచి తప్పుకుంటారని కథానాలు వస్తున్నాయి. ఆయన ప్లేస్లో వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వాల్లో బీసీ నాయకులకు టీటీడీ ఛైర్మన్ పదవులు ఇస్తూ వచ్చారు. గతంలో కాగిత వెంకట్రావు…2014లో అధికారంలోకి వచ్చినప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ని టీటీడీ ఛైర్మన్గా పెట్టారు.
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద పెద్ద పదవుల్లో రెడ్లకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదే క్రమంలో జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్గా నియమించారు. ఒక టర్మ్ అయినా సరే మళ్ళీ ఆయన్ని పదవులో కొనసాగిస్తున్నారు. అయితే సుబ్బారెడ్డి మాత్రం రాజ్యసభ పదవి వస్తుందని ఆశించారు. కానీ జగన్ మళ్ళీ టీటీడీ ఛైర్మన్ పదవిలోనే కొనసాగించారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు.
అయితే ఇలా రెండు నిర్వహించడం కష్టంగా మారడంతో టీటీడీపీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని సుబ్బారెడ్డి డిసైడ్ అయినట్లు తెలిసింది. దీనికి జగన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ పదవిలో భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇస్తారనే ప్రచారం ఉంది. గతంలో వైఎస్సార్ హయాంలో ఈయన ఛైర్మన్ గా చేశారు.
అలాగే ఈ సారి పదవి బీసీలకు ఇస్తే బాగుంటుందనే డిమాండ్ వస్తుంది. దీంతో బీసీ నేత జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీలో మొదట నుంచి పనిచేస్తున్న జంగా కృష్ణమూర్తి.. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన బీసీ (యాదవ వర్గం)కు చెందిన నేత. గతంలో ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి చూడాలి టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో.