ఇటీవల ఏపీ రాజకీయాల్లో యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. ఇంతకాలం నందికొట్కూరు ఇంచార్జ్ గానే కనిపించిన బైరెడ్డికి శాప్ ఛైర్మన్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రాష్ట్రం మొత్తం పర్యటించడం మొదలుపెట్టారు. ఇక ఈయనకు వైసీపీ యూత్ లో మంచి క్రేజ్ పెరిగింది. తాజాగా వైసీపీ యూత్ సెల్‌కు బైరెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. దీంతో బైరెడ్డి ప్రత్యర్ధి పార్టీలపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు.
మొన్నటివరకు ఆయన చంద్రబాబుపై గాని, పవన్ పై గాని పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు రూట్ మార్చారు. తనదైన శైలిలో జగన్‌ని పొగడటం బాబు, పవన్‌లని విమర్శించడం చేస్తున్నారు. అయితే మంత్రులు గాని, సీనియర్ నేతలు గాని చేసే కార్యక్రమం కూడా ఇదే అని, వారు పదవుల నిలుపుకోవడం కోసం, పదవులు తెచ్చుకోవడం కోసం ఆ రకంగా జగన్‌కు భజన చేయడం, బాబు-పవన్ లని తిట్టడం చేస్తున్నారని, ఇప్పుడు బైరెడ్డి కూడా అదే ఫార్మాట్లోకి వచ్చారనే..అంటే ఏదో సీటు ఆశించే బైరెడ్డి ఈ రకమైన రాజకీయం మొదలుపెట్టారని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి.
తాజాగా జగన్‌ని పొగుడుతూ..ఆయనకు తెలంగాణలో ప్రతి గ్రామంలో అభిమానంలో ఉన్నారని, ఆయన తెలంగాణలో వేలు పెడితే సీన్ మారిపోతుందని అన్నారు. ఇక రంగం సినిమాలో విలన్ బయట ఉద్యమం అంటాడని, పోరాటం అంటాడని, లోపల ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకుని ఉంటాడని పవన్ కూడా అంతేనంటూ ఫైర్ అయ్యారు. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు, పేద ప్రజలను మోసం చేసింది ఎవరైనా ఉంటే అది చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. ఇలా బైరెడ్డి మాట్లాడటం వెనుక కారణం ఉందని, నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కోసమే బైరెడ్డి ఇలా కష్టపడుతున్నారని టీడీపీ-జనసేన శ్రేణులు కామెంట్ చేస్తున్నాయి.