ఇటీవల సికింద్రాబాద్ లోని మినిస్టర్ రోడ్డులో అగ్ని ప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ భవనం కూల్చివేత ప్రక్రియ పనులు కొనసాగుతున్నాయి. ఈనెల 19న డెక్కన్ మాల్ లోని సెల్లార్ లో మంటలు చెలరేగాయి. సుమారు 12 గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మంటల్లో ఉన్న భవనంలోని స్లాబులు ఒక్కొక్కటిగా పెచ్చులూడుతూ వచ్చాయి. మంటలు ఎక్కువగా రావడమే స్టాల్ పూర్తిగా బలహీనపడి కూలిపోయినట్లు అధికారులు భావించారు. భవనం క్రమంగా బలహీన పడి కుప్పకూలే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు కూల్చివేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. భవనం కూల్చివేతకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది. భవనం కూల్చేత పనులను మాలిక్ సంస్థ చేపట్టింది.
వారం రోజుల్లో భవనం పూర్తిగా కూల్చివేత చేసేలా అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో నేడు ఈ కూల్చివేత పనులలో పెను ప్రమాదం తప్పింది. మాల్ కూల్చివేత సమయంలో ఒక్కసారిగా ఆరు ఫ్లోర్లు కుప్పకూలాయి. చుట్టుపక్కల ఇల్లు ఖాళీ చేయడంతో ప్రమాదం తప్పింది. కూల్చివేత పనులు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.