వానాకాలం వచ్చిందటే చాలు. ప్రకృతి పచ్చదనాన్ని తొడుక్కుంటుంది. ఇలా ఏడాది కోసారి పలకరించి వెళ్లే పచ్చదనపు ఆనందాన్ని ఆశ్వాదించనిదెవరు? చిరుజల్లులను తాకి తపించిపోనివారెందరు. మరి ఇలాంటి వానాకాలంలో కాకుండా ఏడాదంతా ముసురుదుప్పటి కప్పుకొనే కొన్ని ప్రాంతాలు మన దేశంలో ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చి సరదాగా గడిపేయండని ఆహ్వానిస్తున్నాయి. ఈ వానాకాలమైనా, వచ్చే శీతాకాలమైనా వెళ్లి వానాకాలపు వాతావరణాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని మనసారా నింపుకొనే వీలున్న ఆ ప్రాంతాల్లో
చిరపుంజి ఒకటి..
ఎటు చూసినా పచ్చదనం తివాచీ పరుచుకున్నట్టు కనిపించే అందమైన వాతావరణం. లీలగా ఒంటిని తాకి వెళ్లె చిరుగాలులు, మనకోసమే నింగి నుంచి రాలిపడుతున్నట్టు అనిపించే చిరుజల్లలు చిరపుంజిలో చూడొచ్చు. మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగుకు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజీ ఓ అందమైన ప్రకృతి నిలయం. చిరపుంజీని చిర్రాపుంజి అని కూడా పిలుస్తారు. ఇది మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతిగాంచింది. దీనికి సమీపంలో ఉండే మాసిన్రామ్‌లో అత్యధిక వర్షపాతం ఉంటోంది. చిరపుంజీ అసలు పేరు సొరా, దీన్ని చురా అని బ్రిటిష్ వారు పిలిచేవారు. కాలక్రమేణా అది చిరపుంజీగా మారింది. చిరపుంజీకి వెళ్లాలంటే ముందు షిల్లాంగ్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి ఘాట్ రోడ్‌లో సాగే ప్రయాణంలో చుట్టూ ఎత్తైన పర్వతాలను చూస్తూ వాటినుంచి జాలువారేజలపాతాలను తన్మయత్వంతో తిలకించవచ్చు. చిరపుంజీ ప్రాంతం దాదాపుగా లైమ్ రాతిగుహలతో నిండి ఉంటుంది. ఇక్కడ పురాతన ప్రెస్బిటేరియన్ చర్చి, రామకృష్ణ మిషన్‌లను దర్శించవచ్చు. దగ్గర్లో ఉన్న మాసిన్రామ్ ప్రాంతంలో ఏర్పడిన సహజ శివలింగ రూపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ శివలింగాన్ని స్థానికులు మావ్ జింబుయిన్‌గా వ్యవహరిస్తారు. షిల్లాంగ్ చుట్టు పక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దాదాపు ప్రతిరోజు టూరిస్టులతో సందడిగా ఉండే షిల్లాంగ్‌లో మ్యూజియం ఆఫ్ ఎంటోమాలజీ అనే సీతాకోక చిలుకల పార్క్ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రముఖ హిల్ స్టేషనైనా షిల్లాంగ్ కేవలం పర్యాటకులకే కాక సినిమా షూటింగ్‌లకు కూడా అనువైన ప్రదేశం.