శాసనసభలో ధరణిపై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్. దందాలు చేస్తున్న వారికే ధరణి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ధరణిని రద్దు చేయడం, ప్రగతి భవన్ ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయడమేనా కాంగ్రెస్ విధానం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి తో దోస్తానాతో బట్టి, శ్రీధర్ బాబులు చెడిపోయారని అన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా భూములపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వద్ద ఒక దఫ్తర్ నడుస్తుందని.. ఓ ప్రత్యేక కార్యాలయంలో రిటైర్డ్ తహసీల్దారులతో కొంతమందిని కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని, ప్రైవేటు వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసే వారికి ధరణి వల్ల ఇబ్బంది ఉంటుందన్నారు. అది శ్రీధర్ బాబుకు ఉండకూడదన్నారు. సభను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.