అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ముఖ్యమంత్రిని కలిసేందుకు జగ్గారెడ్డి అపాయింట్మెంట్ కోరడంతో, సీఎం ఛాంబర్ లోకి వెళ్లిన తరువాత జగ్గారెడ్డిని పిలిచారు. దీంతో మరోసారి రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అయితే ముఖ్యమంత్రిని కలవడంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రిని కలిశానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. దీంతోపాటు 500 మందికి దళిత బంధు ఇవ్వాలని, మహబూబ్ సాగర్ అభివృద్ధికి, సంగారెడ్డి చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీని కలిస్తే లేని వివాదం ముఖ్యమంత్రిని కలిస్తే వస్తుందా అంటూ సమర్ధించుకున్నారు జగ్గారెడ్డి. అలాగే ముఖ్యమంత్రి తన ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించారని, మరోసారి కలవాలని సూచించారని చెప్పుకొచ్చారు.