సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి రావడంతో వాహనదారులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏ ఒక్కటి మిస్ అయినా ఫైన్ మోత మోగిపోతుంది. ఈ క్రమంలోనే వేలు దాటి ఇప్పుడు లక్షల ఫైన్లు వేసే పరిస్థితి దాపురించింది. దీనిపై సామాన్య జనం నుంచి విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన ట్రక్ డ్రైవర్‌కు సెప్టెంబర్ 3 న పలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ .86,500 జరిమానా విధించారు.
అంతకుముందు ఓ బైకర్ కు రూ.27వేల ఫైన్ వేశారు. ఇలా ఇప్పుడు వేలను దాటి ఈ ఫైన్ లక్షలకు చేరింది. ఢిల్లీలో సవరించిన మోటారు వాహన చట్టం ప్రకారం అనేక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాజస్థాన్ వ్యక్తికి రూ. 1.41.700లు జరిమానా విధించారు. ట్రక్కు యజమాని భగవాన్ రామ్ ఓవర్‌లోడ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ జరిమానా విధించారు. వాస్తవానికి కొత్త మోటర్ వాహనాల చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఇదే అత్యధిక ట్రాఫిక్ ఫైన్ అని చెప్పాలి.
ఇక దీంతో హడలెత్తిన జనాలు రోడ్డుపైకి రావడానికే భయపడుతున్నారు.హెల్మెట్ సహా అన్ని పత్రాలు తీసుకొనే రోడ్డెక్కుతున్నారు. ఇప్పుడు దేశంలోనే ఇంత భారీ ఫైన్ చూశాక ఇక మరింత అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను కఠినతరం చేయడానికి మరియు రహదారి భద్రతను మెరుగుపరిచే ప్రయత్నంలో ఉల్లంఘనకు కఠినమైన శిక్షలు విధిస్తున్నారు.