శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఏక్ నాథ్ శిందే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ(యుబీటీ వర్గం) అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. శివసేన ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’ను చోరీ చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో నిందితుడికి గుణపాఠం చెప్పాల్సి ఉందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేను ఉద్దేశించి విరుచుకుపడ్డారు.
ఇవాళ ‘మాతో శ్రీ’ వద్ద ఉద్ధవ్ తన మద్దతుదారులతో ఈ మేరకు మాట్లాడారు. ‘‘విల్లు- బాణంతో మైదానంలోకి రమ్మని ఆయనకు సవాలు విసురుతోన్నా. మేం దానిని మండే ‘కాగడా’తో ఎదుర్కొంటాం’ అని శిందేను ఉద్దేశించి ఠాక్రే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శివసేన ఉద్ధవ్ వర్గానికి ‘కాగడా’ ఎన్నికల గుర్తుగా ఉంది. పుణె జిల్లాలోని కస్బా పేట్, చించ్వాడ్ ఉప ఎన్నికల వరకు ఈ గుర్తు ఉద్ధవ్ వర్గం వద్దే ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 26న ఉప ఎన్నికలు జరగనున్నాయి.