ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా (Team India) తొలి ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 263 పరుగులకు బదులుగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టుకు లభించింది కేవలం ఒక పరుగు ఆధిక్యమే. టీమిండియా స్కోరు ఇక్కడిదాకా రావడానికి కారణం అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ వీరోచిత పోరాటమే. ఓ దశలో ఆసీస్ స్పిన్నర్ల ధాటికి టీమిండియా 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. భారత్ 150 పరుగులు చేస్తే గొప్ప అనుకున్న స్థితిలో అక్షర్ పటేల్, అశ్విన్ ఆసీస్ బౌలింగ్ దాడులను సమర్థంగా ఎదుర్కొని జట్టు స్కోరును 250 దాటించారు.
అక్షర్ 115 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. అశ్విన్ 71 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. ఆసీస్ బౌలర్లలో లైయన్ 5, కుహ్నెమన్ 2, టాడ్ మర్ఫీ 2, కమిన్స్ 1 వికెట్ తీశారు. ఆటకు నేడు రెండో రోజు కాగా, చివరి సెషన్ లో ఆస్ట్రేలియా జట్టు తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఒక ఓవర్ ముగిసేసరికి ఆసీస్ స్కోరు వికెట్ నష్టపోకుండా 2 పరుగులు. ఫీల్డింగ్ లో గాయపడిన డేవిడ్ వార్నర్ బరిలోకి దిగలేదు. దాంతో ఉస్మాన్ ఖవాజాకు జతగా ట్రావిస్ హెడ్ ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభించాడు.