వెల్లుల్లిని నిత్యం తినడం వల్ల లివర్ శుభ్రమవుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు లివర్‌లోని టాక్సిన్లను నాశనం చేసి బయటకు పంపుతాయి.
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది అనేక క్రియలను నిర్వర్తిస్తుంది. మన శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది. మన శరీరానికి శక్తిని అందిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. మనకు కావల్సిన శక్తిని నిల్వ చేసుకుంటుంది. ఇంకా అనేక ఇతర పనులను లివర్ చేస్తుంది. అయితే చాలా మందికి అస్తవ్యస్తమైన జీవన విధానం, పలు ఇతర కారణాల వల్ల లివర్ సమస్యలు వస్తుంటాయి. దీంతో లివర్‌లో వ్యర్థాలు పేరుకుపోయి అనారోగ్యాలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే లివర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ఆహారాలను తరచూ తీసుకోవాలి. దీంతో లివర్ శుభ్రమవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. మరి లివర్ శుభ్రంగా ఉండేందుకు నిత్యం మనం తీసుకోవాల్సిన ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. వెల్లుల్లిని నిత్యం తినడం వల్ల లివర్ శుభ్రమవుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు లివర్‌లోని టాక్సిన్లను నాశనం చేసి బయటకు పంపుతాయి. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే లివర్ శుభ్రంగా మారుతుంది.
2. బీట్‌రూట్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిత్యం ఉదయాన్నే బీట్‌రూట్ జ్యూస్ తాగితే లివర్ శుభ్రమవుతుంది. అందులో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
3. వాల్‌నట్స్‌ను నిత్యం తినడం వల్ల కూడా లివర్‌ను శుభ్రపరుచుకోవచ్చు. వాల్‌నట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్‌ను శుభ్రం చేస్తాయి. లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి.
4. నిత్యం 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగితే లివర్ వ్యాధులు, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. అందువల్ల నిత్యం టీకి బదులుగా కాఫీని తాగడం అలవాటు చేసుకుంటే లివర్‌ను శుభ్రంగా ఉంచుకోవచ్చు.
5. పర్పుల్ కలర్‌లో ఉండే ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ద్రాక్ష పండ్లను తరచూ తిన్నా లివర్ బాగా పనిచేస్తుంది. లివర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
6. వారంలో కనీసం 2 లేదా 3 సార్లు చేపలను తిన్నా లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. వాటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్‌ను సంరక్షిస్తాయి. లివర్ వ్యాధులు రాకుండా చూస్తాయి.
7. ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం అలవాటు చేసుకుంటే లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్ సమస్యలు ఉన్నవారు ఆలివ్ ఆయిల్‌ను వాడడం మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. దీంతో లివర్ లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.