బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ దృశ్యం సినిమా హీరోలాగే ప్రవర్తించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం హత్య చేసిన నిందితుడు.. దాన్నుంచి తప్పించుకోవడానికి సాక్ష్యాధారాలు దొరక్కుండా దృశ్యం మూవీలో వెంకటేశ్‌లా జాగ్రత్త పడ్డాడు.
నవీన్ అదృశ్యమయ్యాక చివరిసారి కలిసింది హరిహరను కావడం.. అతని స్నేహితులు పదేపదే ఫోన్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో లొంగిపోయినట్లు పోలీసులు తేల్చారు. ఆ తర్వాత తానొక్కడినే హత్య చేశానంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. హసన్, ప్రేమించిన యువతి పాత్ర దాచేందుకు చివరివరకూ ప్రయత్నించాడు. నవీన్‌ను కిరాతకంగా హత్య చేసిన హరిహర దాన్ని గంజాయి ముఠాలపై వేయాలని ప్రయత్నించినట్లు సమాచారం.
17వ తేదీన సాయంత్రం నవీన్ తనను కలిశాక.. తనతో గొడవపడ్డాడని.. ఆ తర్వాత గంజాయి కోసం కొందరిని కలిసేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ వెళ్లాడని హరిహరకృష్ణ నమ్మించాడు. ఒకవేళ నవీన్ మృతదేహాన్ని గుర్తిస్తే గంజాయి బ్యాచ్‌లపై నెట్టేసేందుకు ఈ కట్టుకథ చెప్పినట్లు తెలిసింది.