సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమౌతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” అనే ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మహిళందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పురుషునితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ విభిన్న రంగాలలో మహిళలు సాధిస్తున్న అపూర్వమైన విజయాలు నారీశక్తిని చాటుతున్నాయని సీఎం అన్నారు. స్త్రీ శక్తికి చాటే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మహిళాసాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు, వారి గౌరవాన్ని పెంపొందిస్తూ, స్త్రీజనోద్ధరణే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరుస్తున్నదన్నారు.. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలకు ప్రత్యేక సెలవును మంజూరు చేసి మహిళలను సమున్నతంగా గౌరవించుకుంటున్నామని తెలిపారు.
తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్నదని సీఎం తెలిపారు. ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి ఆ బిడ్డ జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ ఆడబిడ్డను కంటికి రెప్పలా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటున్నదని సీఎం వివరించారు. మహిళా సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థవంతమైన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలు:
గర్భిణులు, బాలింతల సంక్షేమానికి “కేసీఆర్ కిట్” పథకం కింద లబ్దిదారులకు మూడు విడతలుగా మొత్తం రూ. 12 వేలు అందిస్తారు. ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో వెయ్యి రూపాయలు అదనంగా కలిపి 13 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రయోజం పొందిన లబ్దిదారులు 13,90,639 మంది కాగా అందుకోసం చేసిన ఖర్చు 1261.67 కోట్లు.
గర్భిణుల్లో రక్తహీనత నివారణ, పోషకాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన “కేసీఆర్ న్యూట్రిషన్ కిట్” పథకం కింద గర్భిణులకు విడతల వారీగా పోషకాహార కిట్ లను అందిస్తారు. మహిళల సంపూర్ణ రక్షణ కోసం, సామాజిక భద్రత కోసం దేశంలోనే ప్రప్రథమంగా షీ టీమ్ పేరుతో ప్రత్యేక పోలీస్ విభాగం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధానం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. గర్భిణులకు, బాలింతలకు, 6 సంవత్సరాల లోపు చిన్నారులకు సంపూర్ణ పోహకాహారాన్ని అందించే లక్ష్యంతో 35,700 అంగన్ వాడీల ద్వారా ఆరోగ్య లక్ష్మీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. వందల కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 1,73,85,797 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందారు. గర్భిణులకు ఆసుపత్రులకు వెళ్ళిరావడానికి అమ్మ ఒడి పేరుతో అమలు చేస్తున్న పథకం ద్వారా 22,19,504 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 166.19 కోట్లను ఖర్చు చేసింది. నేటి వరకు ఆసరా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్రంలోని 1,52,050 మంది ఒంటరి మహళలకు, 1,430 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెన్షన్ గా చెల్లించింది. భర్తను కోల్పోయిన వితంతువులుగా మారిన 15,74,905 మంది మహిళలు 19,000.13 కోట్ల రూపాయలు, 4,80,861 మంది మహిళా బీడీ కార్మికులు రూ. 5,393.19 కోట్లను పెన్షన్ గా పొందారు.