బిఆర్ఎస్ ‘జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి అనే తమ తొలి ఆంగ్ల పుస్తకాన్ని నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదు సంవత్సరాలుగా చేసిన మేధోమథనానికి దర్పణంగా.. సీపీఆర్‌వో వనం జ్వాలా నరసింహారావు గారు ఈ పుస్తకాన్ని రచించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఈ పుస్తకాన్ని ప్రచురించారు.ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వాలా నరసింహారావు, జూలూరీ గౌరీశంకర్‌ను ప్రశంసించారు. 2018 మార్చి 3న ప్రగతిభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లో రావాల్సిన గుణాత్మక మార్పు ఆవశ్యకతను వివరించారు.
ఆ మార్పు కోసం అవసరమైతే, ప్రజలు కోరుకుంటే తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తానన్న అభీష్టాన్ని సైతం వెల్లడించారు. అప్పటి నుంచి గత ఐదు సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్తావన దరిమిలా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2023 ఫిబ్రవరి 5న నాందేడ్‌లో జరిగిన బీఆర్ఎస్ సభ వరకు 35 వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కాగా, బీఆర్ఎస్ ఆవిర్భావ, ఆరోహణా క్రమాన్ని మాత్రమే కాకుండా, వర్తమాన జాతీయ రాజకీయాల గురించి పరిశోధనా దృక్పథంతో అధ్యయనం చేసే వారికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.