బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఏవైనా అవినీతి ఆరోపణలు వస్తే మాత్రం ఏమాత్రం వెనకాడకుండా తీసేస్తామని హెచ్చరించారు. 99 శాతం సిట్టింగులందరికి తిరిగి సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి మాత్రం టికెట్లు దక్కవని చెప్పారు.
“రాష్ట్రంలో రాజకీయంగా బీఆర్‌ఎస్‌కే అనుకూల వాతావరణం నెలకొంది. తిరిగి మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ అవినీతికి పాల్పడొద్దు. గతంలో కొన్ని నియోజకవర్గాల్లో దళితబంధు గురించి ఆరోపణలు వచ్చాయి. గత ఎన్నికల్లో కొందరిని తమ తీరు మార్చుకోవాలని పదే పదే చెప్పి చూశా. వాళ్లు తమ పద్ధతిని మార్చుకోలేదు కాబట్టే వారిని మార్చాల్సి వచ్చింది. ఈసారి సిట్టింగులెవరినీ మార్చాలనే ఉద్దేశం నాకైతే లేదు. ఎవరైనా తమంతట తాము తప్పులు చేస్తే తప్ప.. 99 శాతం సిట్టింగులందరికీ తిరిగి సీట్లు వస్తాయి. నేనే గెలిపించుకుంటా.” – సీఎం కేసీఆర్