భారత రాష్ట్ర సమితిని ప్రజల్లోకి మరింత దగ్గరగా తీసుకువెళ్లేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు టెలి కాన్ఫరెన్స్ లో పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఆదివారం జిల్లా పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించినట్లుగా కేటీఆర్ వెల్లడించారు.
ఈనెల 25న నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, విద్యార్థి విభాగం నూతన కమిటీలు వేసుకోవాలని సూచించారు. అంబేద్కర్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా జరపాలని, పార్టీ ఆవిర్భావ దినోత్సవ షెడ్యూల్ సిద్ధం చేసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నేతలకు సూచించారు. పార్టీలో పనిచేసే కిందిస్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి నాయకులందరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఏ రోజు ఏ ఏ యూనిట్లో, ఎక్కడ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారో తేదీలతో సహా పార్టీ వివరాలు అందించాలని కేసీఆర్ సూచించారని కేటీఆర్ వివరించారు.