కోట్లాదిమంది ఇండియన్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు అని వేయికళ్లతో ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు వేడుక ఈరోజు ఘనంగా జరిగింది. తెలుగు పాట చరిత్ర సృష్టించింది. 130 కోట్ల మంది గర్వించేలా తెలుగోడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని “నాటు నాటు” పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డుని ప్రకటించింది.
“నాటు నాటు” పాటకు ఆస్కార్ దక్కడంపై సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీసాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఆస్కార్ అవార్డుల విషయంలో కేంద్రం తెలుగు వారిపై వివక్ష చూపిందని ఆరోపించారు.
దేశం తరపున అధికారికంగా ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. గుజరాత్ సినిమాను ఆస్కార్ కు పంపి.. ఆర్ఆర్ఆర్ ను పంపకపోవడం తెలుగు వారిపై కేంద్రం వివక్షతకు సాక్ష్యం అని ఆరోపించారు. ఇక పాట రాసిన చంద్రబోస్, పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరు తెలంగాణ బిడ్డలేనని, ఇది తెలుగు జాతికి మరువలేని రోజు అని తెలిపారు.