ఆర్ఆర్ఆర్, ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాలకు ఆస్కార్ రావడం తెలిసిందె. అయితే ఈ ఆస్కార్ హడావిడి పార్లమెంట్ లో కూడా నడుస్తుంది. ఈ రెండు సినిమాలకు అవార్డులు రావడం పై రాజ్యసభ హర్షం వ్యక్తపరిచింది . ఈ నేపథ్యంలో, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేపట్టిన వ్యాఖ్యలు అందరిని నవ్వించాయి. ఎప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కే సభ .. నిన్న కాసేపు కూల్ గా జరిగింది.
మల్లికార్జున ఖర్గే రెండు సినిమాలకు ఆస్కార్ అవార్డులు రావడంపై రాజ్యసభలో స్పందించారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన ఖర్గే, ఇది భారత దేశానికే ఎంతో గర్వకారణమన్నారు. అయితే ఇదే సమయంలో మోదీని ఉద్దేశిస్తూ సెటైర్ల వర్షం కురిపించారు ఆయన. ‘‘మనకు ఇది గర్వకారణం. అయితే ఆస్కార్ అవార్డుల క్రెడిట్ ను అధికార పార్టీ తీసుకోవద్దు ప్లీజ్.. నా ఏకైక అభ్యర్థన ఇది. ‘మేమే దర్శకత్వం వహించాం.. మేమే రచించాం.. మోదీజీ దర్శకత్వం వహించారు’ అని అనొద్దు ’’ అని హేళన చెయ్యడంతో అందరు పొట్టలు చించుకొన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలో ఉన్న వారంతా కాసేపు అన్ని మర్చిపోయి నవ్వేశారు . అధికార, ప్రతిపక్ష సభ్యులతోపాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్, కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, జైశంకర్, మాండవీయ తదితరులంతా నవ్వుతూ కనిపించారు.