ఇంటర్ పరీక్షలకు మాధ్యమిక విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పరీక్షల చీఫ్ సూపరిండెంటెండెంట్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశాలు పూర్తిచేసి అధికారులను సిద్ధం చేశారు. పరీక్ష పత్రాలు సైతం ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. ఈ నెల 15వ తేదీన ఫస్టియర్, 16న సెకండియర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కాపీయింగ్ నిరోధించేందుకు ఎప్పటికప్పుడు ఫ్ల్లయింగ్ స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయని, మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే విద్యార్థులను డిబార్ చేయడంతో పాటు ఇన్విజిలేటర్, నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు మాధ్యమిక శాఖ అధికారులు సిద్ధమయ్యారు.
ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ www.tsbie.cgg.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం హాల్ టికెట్ కోసం పదో తరగతి హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కోసం ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించడం జరుగుతుంది. కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఫీజుల కోసం హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ సౌకర్యం కల్పించింది.